- అమెజాన్‌లో తక్కువ ధరకే స్మూత్ స్క్రీన్, గొప్ప పెర్ఫార్మన్స్ చూపే టాప్ క్వాలిటీ టాబ్లెట్స్‌ను సొంతం చేసుకోండి
శైలేంద్ర ‘సారధి’ ఎంట్రీ..
ఇక కాసేపటికి కాలేజ్‌లో మెడికల్ కాలేజ్ కట్టడానికి బిల్డర్స్ గురించి.. జగతి, ఫణేంద్ర, వసుల ముందే రిషి చర్చిస్తూ ఉంటాడు. ‘బెస్ట్ బిల్డర్స్‌ని పిలిచి టెండర్ వేద్దాం’ అంటూ రిషి మాట్లాడుతుంటే.. శైలేంద్ర వస్తాడు. ‘అదేంటి నాకు తెలిసిన బిల్డర్‌ని పిలవమని చెప్పావ్‌గా రిషి? తనని పిలిచాను, వచ్చి బయట ఉన్నాడు’ అంటాడు శైలేంద్ర జగతి వైపు చూస్తూ. ‘అయ్యో అన్నయ్యా మరిచిపోయాను.. రమ్మను అతడ్ని’ అంటాడు రిషి. దాంతో ఆ వ్యక్తిని లోపలికి పిలిపిస్తాడు రిషి. ‘రిషీ.. ఇతడి పేరు సారధి.. ఎస్.ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇన్‌ఛార్జ్..’ అని రిషికి పరిచయం చేస్తాడు. రిషి పైకి లేచి చేయి అందించి వెల్ కమ్ చెప్పి.. సారధిని కూర్చోమంటాడు.
జగతి ప్రశ్నలు..
అతడ్ని ఫణేంద్ర పక్కనే కూర్చొబెట్టి.. ‘ఇతడి గురించి నాకు బాగా తెలుసు.. ఇండియాలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాడు. మేము కూడా కలిసి పని చేశాం.. ’ అంటూ చాలా గొప్పగా పొగుడుతూ చెబుతాడు. ‘అవునా.. నీకు తెలిసి ఉంటే చాలులే’ అంటాడు ఫణేంద్ర నవ్వుతూ. ఇక అప్పుడే జగతి.. ‘అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన మీరు.. ఈ కాలేజ్‌కి పని చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు?’ అంటుంది సారధివైపు చూస్తూ. ‘అంటే నేను ఈ డీబీఎస్‌టీ కాలేజ్ గురించి చాలా విన్నాను.. టీవీల్లో చూశాను.. ఇంత గొప్ప కాలేజ్‌కి పని చేయడం చాలా సంతృప్తిని ఇస్తుంది మేడమ్.. అందుకే శైలేంద్రగారు చెప్పగానే ఒప్పుకుని.. వచ్చేశాను’ అంటాడు సారధి చాలా కూల్‌గా దొరక్కుండా.
ఆరా తీసిన వసు..
వెంటనే వసు.. ‘మరి ఇంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ డెమో అయినా ఉందా? చూపించండి’ అంటుంది వసు సారధినే అనమానంగా చూస్తూ. ‘అది.. అది లేదు మేడమ్.. అంటే నేను అనుకోకుండా కంగారుగా వచ్చేశాను..’ అంటూ నసుగుతాడు సారధి. ‘పోనీ ఫోన్‌లో కానీ ల్యాప్ టాప్‌లో కానీ ఉంటాయి కదా.. వాటినైనా చూపించండి.. ఏది చూడకుండా కాంట్రాక్ట్ ఇవ్వలేం కదా?’ అంటుంది వసు. ‘ల్యాప్ టాప్ మరిచిపోయాను’ అంటాడు సారధి తెలివిగా. ‘అయ్యో సారధి గారు.. మీరు అవన్నీ తీసుకునే రావాలి కదా? మిమ్మల్ని పిలిచిన విషయమే దాని గురించి కదా?’ అంటాడు శైలేంద్ర సారధిని కవర్ చేస్తూ.
శైలేంద్ర స్కెచ్..
‘అవసరం లేదేమో శైలేంద్ర.. నువ్వే చెబుతున్నావ్‌గా ఇతడి గురించి?’ అంటాడు ఫణేంద్ర కూల్‌గా. ‘నాకేం అవసరం లేదు డాడ్.. ఈ పిన్నీ, వసుధారలు ఇతడ్ని నమ్మడం లేదు కదా.. మనమేం చేస్తాం.. సారధి గారు అన్నీ ఫ్రూప్స్ తీసుకుని వచ్చాకే పని స్టార్ట్ చేద్దాం’ అంటాడు శైలేంద్ర కావాలనే రిషికి అర్థమయ్యేలా. ‘అయ్యో అన్నయ్యా అలా ఏం లేదు.. నాకు నీ మీద నమ్మకం ఉంది. అది చాలుకదా? సారధిగారు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.. కాంట్రాక్ట్ మీకే ఇస్తాను’ అంటాడు రిషి. దాంతో శైలేంద్ర నవ్వుతాడు. జగతి, వసులు షాక్ అవుతారు. ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వర్క్ చెయ్యాలి.. ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్.. సంతకం చేయండి.. అని పేపర్స్ ఇస్తాడు రిషి.
రిషి క్లారిటీ..
సారధి వాటిని అందుకుని సంతకం చేసి పేపర్స్ తిరిగి ఇస్తూ.. ‘అడ్వాన్స్ త్వరగా ఇచ్చేస్తే.. నేను పని మొదలుపెట్టేస్తా’ అంటాడు. ‘తప్పకుండా ఇస్తాను.. అకౌంట్స్ చూసుకుని ఇస్తాను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను.. అలాగే మీరు కూడా కొటేషన్ రెడీ చేసి చూపించండి.. లేదా మెయిల్ చేయండి..’ అంటాడు రిషి. సరే అని థాంక్స్ చెప్పి సారధి వెళ్లిపోతాడు. ‘వసుధార.. మిగిలిన బిల్డర్స్ అందరి లిప్ట్ తీసేసి.. సారధి గారి పేరు చేర్పించు’ అంటాడు రిషి. ఇంతలో రిషికి కాల్ రావడంతో.. అక్కడ నుంచి పైకి లేచి వెళ్తాడు.
అంతా వినేస్తున్న శైలేంద్ర..
శైలేంద్ర, ఫణేంద్ర కూడా వెళ్లడంతో.. జగతి, వసులు మాత్రమే ఆ రూమ్‌లో ఉంటారు. ‘మేడమ్ ఏంటిది బెస్ట్ బిల్డర్‌ని తేవాలనుకుంటే.. ఆ శైలేంద్ర గారు తెచ్చిన బిల్డర్‌ని రిషి సార్ ఓకే చేశారు. అతడు ఎలాంటి వాడో ఏంటో తెలియదు. ఇంతకు ముందు ఏం చేశాడో కూడా సరిగా తెలియదు.. ఏదైనా అడిగితే పెద్దపెద్దవి చేశాను అంటున్నాడు. అసలు ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో నాకు అర్థం కావట్లేదు మేడమ్’అంటుంది వసు కంగారుగా. ‘వాళ్లు ఎన్ని ప్లాన్స్ చేసినా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి వసు’ అంటుంది జగతి. అంతా శైలేంద్ర కిటికీ అవతల నుంచి వింటూ ఉంటాడు.
రిషి సార్‌కి నిజం చెబుతాను..
‘జాగ్రత్తగానే ఉంటాం మేడమ్.. కానీ ప్రతిసారి రిషి సార్‌ని అంటిపెట్టుకుని ఉండలేం కదా? శైలేంద్ర గారి విషయం మనం దాచి పెట్టడం కరెక్ట్ కాదు మేడమ్.. మనం దాచిపెట్టినంత కాలం శైలేంద్ర ఇలానే చేస్తారు.. ఈ రోజు ఒకరిని తెచ్చారు.. రేపు మరొకరిని తెస్తారు. అంతా సర్వనాశనం చేస్తారు.. ఆల్ రెడీ ఒకసారి రిషి సార్ దగ్గర నిజం దాచి తప్పు చేశాను..మళ్లీ అదే తప్పు చేయను.. రిషి సార్‌కి నిజం చెబుతాను’ అంటుంది వసు గట్టిగా. ‘వద్దు వసు అంత పని చేయొద్దు’ అంటూ ఆపేప్రయత్నం చేస్తుంది జగతి. అంతా శైలేంద్ర వింటూ.. రగిలిపోతూనే ఉంటాడు.
వసు తెగింపు..
‘చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు వసు. రిషి వాళ్లని నమ్ముతున్నాడు.. వాళ్లనే నమ్ముతాడు. అంతే కానీ వాళ్లు ఇలా చేస్తున్నారు అని నువ్వు నేను చెబితే నమ్మడు. కళ్లారా చూశాం.. చెవులారా విన్నా అన్నా రిషి నమ్మడు’ అంటుంది జగతి. ‘నమ్మేలా చేస్తాను మేడమ్’ అంటుంది వసు. ‘లేదు వసు చెబితే చాలా ఇబ్బందులు వస్తాయి.. చూశావ్ కదా.. ఆల్ రెడీ చూశావ్ కదా.. హత్యప్రయత్నం.. యాక్సిడెంట్ ప్రయత్నం.. తెలిసి కూడా చెబుతా అంటావేంటీ?’ అంటుంది జగతి ఆవేదనగా. ‘తను బెదిరిస్తున్నాడు మేడమ్.. మిమ్మల్ని భయపెట్టాలని అలా చేస్తున్నాడు.. ఇంకా ఇంకా భయపెట్టాలని చూస్తున్నారు.. కచ్చితంగా ఈ విషయం రిషి సార్‌కి చెప్పాల్సిందే మేడమ్’ అంటూ అక్కడి నుంచి రిషి దగ్గరకు వెళ్లబోతుంది వసు.
తృటితో తప్పిన ప్రమాదం..
‘వసు ఆగు వసు నా మాట విను వసు’ అంటూ జగతి వెనుకే పరుగుతీస్తుంది. అంతా విన్న శైలేంద్ర.. ‘ఇలా ఉంది మీ సంగతి’ అన్నట్లు తలాడిస్తాడు కూల్‌గా. వసు మాత్రం ఆగదు. రిషి కింద ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే.. వసు రిషి దగ్గరకు వెళ్తుంది. జగతి వెనుకే వెళ్తుంది వసుని ఆపడానికి. ఇక సరిగ్గా రిషి బిల్డంగ్ ముందు నిలబడి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే.. పైనున్న పూల కుండి రిషికి తిన్నగా పడబోతుంది. అప్పటికే కిందున్న రిషి మీదకు దూసుకొస్తున్న కుండీని వసు చూసి.. పరుగున వెళ్లి.. రిషిని పక్కకు లాగేస్తుంది. క్షణాల్లో అలా జరిగేసరికి.. జగతి కూడా షాక్ అయిపోతుంది. ‘రిషీ’ అని పెద్దగా అరిచేస్తుంది. అక్కడున్న స్టూడెంట్స్ గుమిగూడతారు. జగతి పరుగు రిషి దగ్గరకు వెళ్లి.. ‘రిషి.. చూసుకోవాలి కదా’ అంటుంది కళ్లనిండా నీళ్లతో. వసు కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది.
కళ్లముందే చావుని పరిచయం చేసి.. ఏం తెలియనట్లు..
‘మేడమ్ నేను బాగానే ఉన్నాను’ అంటాడు రిషి. ఇంతలో శైలేంద్ర వచ్చి.. ‘అరరే రిషీ.. ఎంత ప్రమాదం తప్పింది.. నిజంగా ఉదయాన్నే ఎవరి ముఖం చూశావో.. బహుశా పిన్నీ ముఖం చూసి ఉంటావ్’ అంటాడు ఏం తెలియని వాడిలా. వెంటనే ‘వసుధారా రిషిని తీసుకుని వెళ్లు..’ అంటాడు. వసు రిషిని తీసుకుని వెళ్లిపోతుంది. వెంటనే అక్కడే నిలబడి చూస్తున్న స్టూడెంట్స్‌ని కూడా పంపించేసిన శైలేంద్ర జగతి దగ్గరకు వెళ్లి.. పిన్నీ అని పిలుస్తాడు. జగతి అప్పటి దాకా రిషి వెళ్తుంటే రిషి వైపే చూస్తూ ఉంటుంది ఆవేదనగా.
చంపేద్దామనే డిసైడ్ అయ్యి..
‘పిన్నీ కుండీ ఎలా పడిందా అని చూస్తున్నావా? నేనే పడేయించాను’ అంటాడు శైలేంద్ర. జగతి షాక్ అయిపోతుంది. ‘జెస్ట్ మిస్ కదా పిన్నీ.. కనీసం కోమాలోకి పోయేవాడు’ అంటాడు శైలేంద్ర నవ్వుతూ. ‘శైలేంద్రా..’అని అరుస్తుంది జగతి. ‘అరవకు పిన్నీ.. స్టూడెంట్స్ వినేస్తారు. అది మళ్లీ నీకే సమస్య.. ఎందుకు పడేయించానో తెలుసా? నేను కొంచెం హర్ట్ అయ్యాను.. ఇందాక నువ్వు వసుధార మాట్లాడుకోవడం నేను విన్నాను.. చాటుగా వినడం నాకు అలవాటే.. నేను కేవలం బెదిరించడానికే ఇవన్నీ చేస్తున్నా అనుకున్నారు కదా అందుకే ఈ సారి బెదిరించడం కాదు డైరెక్ట్‌గా చంపేద్దామనే డిసైడ్ అయ్యి పూల కుండీ నా మనుషులతో తోయించాను’ అంటాడు శైలేంద్ర.
నీ వల్ల కాదు పిన్నీ.. మానవ మృగాన్ని..
బిత్తరపోతుంది జగతి. నిస్సహాయంగా ఏడుస్తుంది. ‘రేయ్ శైలేంద్రా నువ్వు అసలు మనిషివేనా?’ అంటుంది అసహ్యంగా చూస్తూ. ‘కాదు పిన్నీ మానవ రూపంలో ఉన్న మృగాన్ని.. ఆకలేసినప్పుడు తినడం.. ఆశపుట్టినప్పుడు ఆక్రమించుకోవడం మాత్రమే అలవాటు.. నాకు మిమ్మల్ని బెదిరించాలనో భయపెట్టాలనో అసలు ఉండదు. నాకు కావాల్సింది నేను చేసుకుంటూ పోతాను’ అంటాడు శైలేంద్ర. ‘అందరికీ చెబుతాను నీ విషయం.. ఇంతకాలం ఏదో తెలియని భయంలో ఆగాను కానీ ఇక ఆగను’అంటుంది జగతి కోపంగా. శైలేంద్ర నవ్వుతాడు. ‘నీ వల్ల కాదు పిన్నీ.. నీకు భావోద్వేగ బలహీనత ఉంది’ అంటాడు శైలేంద్ర. జగతి అర్థం కానట్లుగా చూస్తుంది.
జగతి నిస్సహాయంగా..
‘నేను ఇంత దుర్మార్గుడ్ని అని మా డాడీకి చెబితే ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందోనని మీ భయం.. ఒకవేళ ఆయన గుండె నిబ్బరం చేసుకుని ఉన్నా ఈ విషయంలో బాబాయ్‌కి డాడీకి ఏం గొడవలు అవుతాయోనని భయం.. అన్నింటికంటే ముఖ్యంగా.. చెప్పిన మరుక్షణమే నేను రిషిని ఏం చేస్తానో అని భయం.. ఇప్పుడు కూడా అదే కదా జరిగింది. అందుకే రిషిని పంపించెయ్.. లేట్ చేయొద్దు’ అంటాడు శైలేంద్ర. శైలేంద్ర మాత్రం చాలా కూల్‌గా నవ్వుతూ చెబుతుంటే.. జగతి మాత్రం ఏం చేయలేని స్థితిలో అల్లాడిపోతుంది.
నా కంటే గొప్పగా ఎదిగాడు.. అదే రిషి చేసిన తప్పు..
‘పిన్నీ తుది నిర్ణయం నీదే. వాడు ప్రాణాలతో ఉండాలా? అసలు భూమి మీదే లేకుండా పోవాలా? ఎమ్‌డీ సీట్‌లో కూర్చోవాలా.? ఎక్కడో చోట బతికుంటే చాలా? ఎక్కువ ఏడవద్దు పిన్నీ.. మీ కళ్లల్లో సాల్ట్‌నెస్ ఎక్కువ అనుకుంటా.. అందుకే త్వరగా కళ్లు ఎర్రబడుతున్నాయి..’ అంటాడు శైలేంద్ర. ‘శైలేంద్రా ప్లీజ్.. నా కొడుకుని వదిలెయ్.. ఎందుకు అలా పగబట్టావ్’? అంటుంది జగతి ఏడుస్తూ. ‘నా కంటే గొప్పగా ఎదిగాడు.. ఇది చాలదా పిన్నీ? ఎదుటివారి మీద పగ, కోపం పెంచుకోవడానికి?’ అంటాడు శైలేంద్ర. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! (photo courtesy by star maa and disney+ hotstar)
Read also: ‘ఇంటింటి గృహలక్ష్మి’ మే 20 ఎపిసోడ్: లాస్యని ఈడ్చి ఈడ్చి తన్నిన నందు.. తులసి ముందే పైశాచికత్వం
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.